శ్లో|| మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్దిమతాంబరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామ దూతం శిరసానమామి
అది తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం నుండి ౩ కి.మీ. దూరంలో ఉన్న అశ్వారావుపల్లి గ్రామం. ఆ గ్రామంలో ప్రభుత్వం తలపెట్టిన జలయజ్ఞంలో భాగంగా దేవాదుల ప్రాజెక్ట్ నిర్మాణం కొరకు ౨౦౦౭ సంవత్సరంలో మట్టిని త్రవ్వుతుండగా శ్రీ పొట్లపల్లి కళాధర్ రావు గారి పొలంలో పురాతన కాలంనాటి శ్రీ భక్తాంజనేయ స్వామివారి విగ్రహం బయల్పడింది. అద్భుతమైన ఆ భక్తాంజనేయ స్వామి వారి విగ్రహాన్ని చూసి జనులందరూ భక్తి పారవశ్యంతో తండోపతండాలుగా స్వామిని దర్శించి ఆనందించారు. యాదృచ్చికంగా శ్రీ పొట్లపల్లి కళాధర్ రావు గారి వంశీకులు హనుమత్ భక్తులు. వెంటనే వారు వారి పురోహితులైన బ్ర||శ్రీ|| జూగావర్జుల శ్రీనివాస శర్మ గారిని సంప్రదించి బయల్పడిన స్వామి విగ్రహాన్ని వారికి చూపించగా వారు స్వామి విగ్రహాన్ని, ఆ స్థలాన్ని, పరిశీలించి ఎంతో రమణీయంగా, ప్రశాంతంగా ఉన్న ఆ ప్రదేశమందే శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయాన్ని నిర్మించుట శ్రేష్టమని తెలిపారు. శ్రీ కళాధర్ రావు గారు వెంటనే ఇష్ట దైవమైన శ్రీ ఆంజనేయస్వామిని మనసులో స్మరించి ఆలయ నిర్మాణానికి సుమూహర్తమును తెలుసుకొని, స్వస్తిశ్రీ సర్వజిత్ నామ సంవత్సర వైశాఖ బహుళ విదియ – శుక్రవారం తేది. ౦౪.౦౫.౨౦౦౭ రోజున శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయ నిర్మాణానికి భూమి పూజను జరిపించుటకు పూనుకున్నారు. ఆశ్చర్యంగా, సుమూహర్తమునకు ఒక రోజు ముందుగా విపరీతమయిన గాలితో వర్షం కురిసి స్థల శుద్ధి జరిగింది.
దేవాలయ నిర్మాణానికి భూమిపూజ జరిగిన నాటినుంచి స్వామి వారి అనుగ్రహంతో ధనమును శ్రీ కళాధర్ రావు గారు సమకూర్చగా, శ్రీ దేవారెడ్డి అనే భక్తుడు నిర్మాణమును దగ్గర ఉండి చూసుకొనగా (౨) రెండు మాసములలోనే స్వామి వారి దేవాలయము నిర్మింపబడినది.
స్వస్తిశ్రీ సర్వజిత్ నామ సంవత్సర నిజ జ్యేష్ఠ బహుళ దశమి నుండి నిజజ్యేష్ఠ బహుళ ద్వాదశి వరకు శ్రీ భక్తాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమము అంగరంగ వైభవముగా జరిగాయి
Please Feel Free to contact us